చెంపదెబ్బ ఘటన... హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ సంచలన ఆరోపణలు

  • హర్భజన్ సింగ్ గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్న శ్రీశాంత్
  • చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని భజ్జీ రూ.కోటి సంపాదించాడని ఆరోపణ
  • హర్బజన్ సింగ్‌ను తాను క్షమిస్తాను కానీ ఆ ఘటనను మరిచిపోలేనని వ్యాఖ్య
2008 ఐపీఎల్ తొలి సీజన్ సమయంలో జరిగిన చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని హర్భజన్ సింగ్ కోటి రూపాయలు సంపాదించారని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఆరోపించాడు. పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ ఘటనపై స్పందిస్తూ, హర్భజన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు.

హర్భజన్ గురించి తాను ఎప్పుడూ ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదని, అతని గురించి మాట్లాడటం బహుశా ఇదే తొలిసారి అని తెలిపాడు. ఆ రోజు తనను చెంపదెబ్బ కొట్టిన ఘటన గురించి తాను పట్టించుకోవడం మానేశానని, కానీ ఇటీవల హర్భజన్ సింగ్ ఒక యాడ్ చేశాడని గుర్తు చేశాడు. దాని నుంచి అతను కోటి రూపాయలు సంపాదించాడని ఆరోపించాడు. చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని చేసిన ఈ యాడ్ తమ బంధాన్ని తెంచిందని తెలిపాడు.

ఈ చెంపదెబ్బ విషయంలో తాను హర్భజన్‌ను క్షమించానని, కానీ దానిని అతడు వ్యాపారం చేశాడని ఆరోపించాడు. ఈ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయమని తనకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించాడు. అప్పుడు తాను అతడికి ఒకే మాట చెప్పానని, నేను నిన్ను క్షమిస్తాను కానీ ఆ ఘటనను ఎప్పటికీ మరిచిపోనని స్పష్టం చేశానని తెలిపాడు. మనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యులైన వారిని క్షమించవచ్చు కానీ ఆ చెడును మాత్రం మరిచిపోకూడదని అన్నాడు.

ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలలో హర్భజన్ సింగ్ పాల్గొని, తాను చాలా పెద్ద తప్పు చేశానని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. తన కుమార్తె గురించి కూడా మాట్లాడాడని తెలిపాడు. తనకు హర్భజన్ సింగ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని అన్నాడు. కానీ ఇటీవల చేసిన యాడ్‌ను చూసి అతడిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశానని తెలిపాడు. అతడు ఇంటర్వ్యూలలో మాట్లాడిందంతా నటనేనని తనకు అప్పుడు అర్థమైందని అన్నాడు.

Sreesanth
Harbhajan Singh
Slapgate
IPL
Indian Cricket
Controversy
Cricket
Sreesanth interview

More Telugu News